కొనసాగుతున్న జడ్పీటిసి, ఎంపిటిసి పోలింగ్
ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న గ్రామీణ ఓటర్లు

Amaravati: ఆంధ్ర ప్రదేశ్ లో జడ్పీటిసి, ఎంపిటిసి స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. నేటి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఎండలు, వ్యవసాయ సీజన్ కావడంతో ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రామస్తులు ఆసక్తి చూపారు.. పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.. ఆ తర్వాత 1 గంట కరోనా బాధితులు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు.

నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో మధ్యాహ్నం 2 గంటల వరకే పొలింగ్ కొనసాగనుంది. కాగా, జడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ బరిలో 19,002 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 126 జడ్పీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. పరిషత్ ఎన్నికల కోసం 33,663 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,82,15,104 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అవసరమైతే ఈ నెల తొమ్మిదో తేదిన రీపోలింగ్ నిర్వహిస్తారు… ఓట్ల లెక్కింపు, ఫలితాలు మాత్రం హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ప్రకటించనున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/