ప్ర‌ధానికి వ్య‌తిరేకంగా మాట్లాడిన వారిని ఈడీ, సీబీఐ, ఐటీ వెంటాడ‌టం మ‌నం చూస్తున్నాం:ఆప్‌

ap-says-parties-who-speak-against-pm-raided-by-ed-cbi-it

న్యూఢిల్లీ : ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్ మ‌ద్యం కుంభ‌కోణంలో అరెస్ట్‌ పై ఆ పార్టీ నేత అతిషి శుక్ర‌వారం స్పందించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి వ్య‌తిరేకంగా మాట్లాడిన పార్టీల‌పై ఈడీ, సీబీఐ, ఐటీ అధికారుల‌తో దాడులు చేయిస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. సంజ‌య్ సింగ్ నివాసంలో ఈడీ ఒక్క రూపాయి కూడా ప‌ట్టుకోక‌పోయినా ఆయ‌న‌ను బిజెపి ఈడీ అరెస్ట్ చేసింద‌ని అతిషి దుయ్య‌బ‌ట్టారు.

ప్ర‌ధాని మోడీకి వ్య‌తిరేకంగా మాట్లాడిన వారిని ఈడీ, సీబీఐ, ఐటీ వెంటాడ‌టం మ‌నం చూస్తున్నామ‌ని చెప్పారు. సంజ‌య్ సింగ్ ఇంట్లో అవినీతి సొమ్ము ఒక్క రూపాయి దొరికినా దానికి సంబంధించిన ఆధారాల‌ను ప్ర‌జ‌ల ముందు పెట్టాల‌ని తాను కాషాయ పార్టీకి స‌వాల్ చేస్తున్నాన‌ని ఆమె పేర్కొన్నారు. లిక్క‌ర్ స్కామ్‌పై మోడీ స‌ర్కార్ ద‌ర్యాప్తు చేస్తున్న‌ద‌ని, 15 నెల‌లుగా ఈడీ, సీబీఐ 500 మంది అధికారుల‌ను మోహ‌రించి విచార‌ణ చేప‌ట్టినా ఒక్క రూపాయి అవినీతిని కూడా బ‌య‌ట‌పెట్ట‌లేక‌పోయింద‌ని ఎద్దేవా చేశారు.

బిజెపి సార‌ధ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం కానీ, విచార‌ణాధికారులు కానీ ఈ స్కామ్‌లో అవినీతికి సంబంధించిన ఆధారాల‌ను న్యాయ‌స్ధానాలు, దేశ ప్ర‌జ‌ల ముందుంచ‌లేక‌పోయాయ‌ని ఢిల్లీ మంత్రి అతిషి అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే ద‌ర్యాప్తు సంస్ధ మ‌నీష్ సిసోడియా, సంజ‌య్ సింగ్‌ల‌ను అరెస్ట్ చేసింద‌ని ఆమె ఆరోపించారు.