ఏపీ పాలిసెట్‌ ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల

ap-polycet-2022-admissions-start-from-july-29

గుంటూరుః ఏపిలో ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదలైంది. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికిగాను ఏపీ పాలిసెట్‌-2022 మే నెలలో నిర్వహించారు. ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఏపీ సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం, పాలిసెట్-2022లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులు, పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరడానికి ఇష్టపడే అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావడానికి ర్యాంక్, వివరాల నమోదు కోసం ఆన్‌లైన్ ద్వారా రూ.900 చెల్లించాలి.

డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌కు హాజరు కావడానికి అభ్యర్థులు జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు ఓసీలు రూ.900, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. వికేంద్రీకృత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 29 నుంచి ఆగస్టు 5 వరకు కొనసాగుతుంది. మొదటి ర్యాంక్ నుంచి 10,000 ర్యాంక్ హోల్డర్లు విద్యార్హతల ధ్రువీకరణపత్రాలు, పాలిసెట్-2022 ర్యాంక్ కార్డ్‌తో జూలై 29న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. 10,001 నుంచి 25,000 ర్యాంకు ఉన్నవారికి జూలై 30న, 25,001 నుంచి 40,000 ర్యాంకుల వారికి జూలై 31న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, 40,001 నుంచి 55000 ర్యాంకుల వారికి ఆగస్టు 1న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది. 55,001 నుంచి 71,000 మంది ర్యాంక్‌ హోల్డర్లకు ఆగస్టు 2న వెరిఫికేషన్‌, 71,001 నుంచి 87,000 మధ్య ర్యాంకులు సాధించిన వారు ఆగస్టు 3న, 87,001 నుంచి 1,04,040 ర్యాంకులు పొందిన వారు ఆగస్టు 4 న, 1,04,041 నుండి చివరి ర్యాంక్ వరకున్న అభ్యర్థులు ఆగస్టు 5న హాజరుకావాలి.

ఎన్‌సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, ఆంగ్లో ఇండియన్స్‌ అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి 5 వరకు విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఆగస్టు 6, 7 తేదీల్లో ర్యాంక్ 1 నుంచి 40,000 వరకు, ఆగస్టు 8,9 తేదీల్లో ర్యాంక్ 40,001 నుంచి 80,000 వరకు, ఆగస్టు 11న 80,001 ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ వరకు వెబ్ ఎంపిక చేసుకునే వీలుకల్పించారు. అభ్యర్థులు ఆగస్టు 12న వెబ్ ఆప్షన్‌లను మార్చుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం హెల్ప్‌లైన్, హెల్ప్ డెస్క్ సెల్ నంబర్లు 7995681678, 7995865456 సంప్రదించాల్సి ఉంటుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/