ఈసారి ఆంధ్రలో భారీ పోలింగ్ నమోదు..?

గత ఎన్నికలతో పోలిస్తే ఆంధ్రాలో ఈసారి పోలింగ్ భారీగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి మునుపెన్నడూ లేనంతగా ఓటర్లు స్వస్థలాలకు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. ఈసారి యువత చైతన్యవంతంగా కనిపిస్తున్నారని, ఫలితాల విషయంలో ఇది కీలకం కానుందని ఎన్నికల పరిశీలకులు చెబుతున్నారు. అటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు ఉద్యోగుల నుంచి అనూహ్య స్పందన లభించిన సంగతి తెలిసిందే.

పోలింగ్ విధుల్లో ఉండే సిబ్బంది ఈరోజు సాయంత్రం తమకు కేటాయించిన ప్రాంతాలకు ఈవీఎంలతో వెళ్లనున్నారు. పోలింగ్ కు 90 నిమిషాల ముందు మాక్పోల్ నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. రేపు ఉదయం సరిగ్గా ఏడింటికి పోలింగ్ స్టార్ట్ అవుతుందని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ ఏజెంట్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఓటు వేసేందుకు కుటుంబాలతో వెళ్తున్న వారు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు రద్దీకి తగ్గట్లు బస్సులు లేక నిరీక్షించి నిరసించిపోతున్నారు. గంటల తరబడి బస్టాండ్లలోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు RTCలు ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో అవి కనిపించడం లేదు. ఇసుకేస్తే రాలనంత జనంతో బస్టాండ్లన్నీ కిటకిటలాడుతున్నాయి.