ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా లేఖ..

మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా ఉద్యమంలోకి రావాలని ఉందని..తన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్దమే అని గత కొద్దీ రోజుల క్రితం ప్రకటించిన ధర్మాన ..ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యి , తన రాజీనామా లేఖను అందించారు. తన రాజీనామాను అనుమతించాలని కోరారు.

అమరావతి పేరుతో ఒక ప్రాంతానికే మొత్తం సంపదను తరలిస్తూ.. అక్కడే మొత్తం అభివృద్ధి కేంద్రీకరించేలా తీసుకున్న నిర్ణయాన్ని అందులో వివరించారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత అన్ని ప్రాంతాలకు సమ న్యాయం చేయాలనే సంకల్పంతో నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. కానీ ,కొన్ని పార్టీలు కుటిల ప్రయత్నాలు చేస్తూ ఈ మూడు రాజధానుల నిర్ణయం అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. వికేంద్రీకరణ – అభివృద్ధి రాష్ట్ర భవిష్యత్ కు తారకమంత్రిగా మంత్రి ధర్మాన అభివర్ణించారు. అమరావతిని అంత భారీ ఖర్చు చేస్తే మరో హైదరాబాద్ గా మారుతుందని.. ఇతర ప్రాంతాల వారికి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

ధర్మానను వారించిన సీఎం జగన్.. మూడు ప్రాంతాలకు సమన్యాయమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు పంచుతూ వికేంద్రీకరణ చేయటమే ప్రభుత్వ విధానమని మంత్రి స్పష్టం చేసారు. కచ్చితంగా మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని హామీ ఇచ్చారు. మంత్రి పదవికి రాజీనామా అవసరం లేదని వారించారు.