అమరావతి రైతుల పాదయాత్ర ఫై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు

గతంలో ప్రభుత్వం ప్రకటించినట్లుగా రాష్ట్ర రాజధానిగా అమరావతినే ఉంచాలని కోరుతూ అమరావతి రైతులు గత కొద్దీ రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మూడు రాజధానులకు వైస్సార్సీపీ సర్కార్ మద్దతు తెలుపుతుంది. దీంతో రాష్ట్రంలో రాజధాని అంశం మరింత వేడెక్కింది. అమరావతి రైతుల పాదయాత్ర పై వైస్సార్సీపీ నేతల మాటల యుద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. అమరావతి రైతులు చేసేది పాదయాత్ర కాదు.. దండయాత్ర అని మండిప‌డ్డారు.

వికేంద్రీకరణపై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అమరావతి రైతుల‌ను తరిమికొట్టేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. తక్షణమే అమరావతి రైతులు తమ పాదయాత్రను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా తమ ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందన్నారు. రాజధాని కావాలనే ఆకాంక్ష ఉత్తరాంధ్ర ప్రజల్లో బలంగా ఉందని తెలిపారు. భూములను కాపాడుకునేందుకు, రేట్లు పెరిగేందుకే అమరావతి రైతులు తాపత్రయపడుతున్నారని విమర్శలు చేశారు. తాము మాత్రం అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.