ఏపి ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల

AP Intermediate Results Released

అమరావతిః ఏపి ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్ ఆఫీసులో విద్యామండలి కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల్లో 78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సర విద్యార్థుల్లో 67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

ఇంటర్ ఫస్టియర్ లో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 81 శాతంతో గుంటూరు, 79 శాతం ఉత్తీర్ణతతో ఎన్టీఆర్ జిల్లా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా తొలి స్థానంలో నిలిచింది. విద్యార్థులు ఫలితాలను resultsbie.ap.gov.inలో చూసుకోవచ్చు. ఏపీ ఇంటర్ పరీక్షలను దాదాపు 9.99 లక్షల మంది విద్యార్థులు రాశారు. ఎన్నికల నేపథ్యంలో సర్కారు నిర్ణయం మేరకు ఇంటర్ పరీక్షలను మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్ పత్రాల మూల్యాంకనం ఏప్రిల్‌ 4న ముగిసింది.

ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 9.99 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఏపీలో 26 జిల్లాల్లో 1,559 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు.