తెలంగాణకు ఏపీ సర్కారు అద్దె కట్టక తప్పదా..?

తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న ఏపీ ప్రభుత్వ ఆఫీసులు భవనాలను, అతిథి గృహాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. కొనసాగించాలనుకుంటే అద్దె కట్టక తప్పదు. ఖాళీ చేయడమా లేక అద్దె చెల్లించి ఉండటమా అనే అంశంపై ఏపీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏపీ విభజన చట్టంలో సెక్షన్ 5 ప్రకారం అపాయింటెడ్ డే నుంచి (2014 జూన్ 2న) నుంచి GHMC పరిధిలోని ప్రాంతం ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతికి వెళ్లే ముందు.. ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నీ హైదరాబాద్ నుంచి పనిచేశాయి.. పాత సెక్రటేరియట్‌లోని కొన్ని బ్లాకులు కూడా ఏపీకి కేటాయించారు. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. 2016లో తెలంగాణ నుంచి అమరావతికి రాజధాని తరలింపు మొదలు పెట్టారు.. 2017నాటికి ఆ ప్రక్రియను పూర్తి చేశారు. 2019 జూన్‌లో ఏపీ ప్రభుత్వం కొన్నింటిని మినహాయించి భవనాలను అప్పగించింది. ఆ తర్వాత రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న గవర్నర్‌ ఉత్తర్వులు జారీ చేసి ఈ భవనాలపై ఆస్తిపన్ను మాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

ఏపీ ప్రభుత్వం సీఐడీ, హెర్మిటేజ్ భవనాలను పరిపాలనా అవసరాల కోసం.. అలాగే అత్యవసర అవసరాల కోసం కొనసాగించాలని భావిస్తోంది. అలాగే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్ భవన్ రోడ్‌లోని లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌కి వచ్చి విలేకరుల సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.