టిఆర్ఎస్ పార్టీ బైక్‌ ర్యాలీలో టపాసులు పేలిన ఘటనలో యువకుడు మృతి

టిఆర్ఎస్ పార్టీ బైక్‌ ర్యాలీలో టపాసులు పేలిన ఘటనలో యువకుడు మృతి చెందాడు. సంగారెడ్డి లో మెడికల్ కాలేజీ ప్రారంభం​ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో నిర్మించిన మెడికల్ కాలేజీ దాకా టీఆర్ఎస్ లీడర్లు భారీ బైక్ ర్యాలీకి ప్లాన్ చేశారు. బైక్ ర్యాలీ న్యూ కలెక్టరేట్ కు చేరుకుంది. ఆకాశంలో పేల్చే తారా జువ్వ ప్రమాదవశాత్తు పటాకులు ఉన్న ట్రాలీ ఆటోలో పడింది. దీంతో భారీ పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన కుశాల్ (20) 90 శాతం కాలిపోయాడు. వెంటనే అతన్ని హైదరాబాద్​ ఉస్మానియా హాస్పిటల్​కు తరలించగా.. చికిత్స పొందుతూ ఈరోజు చనిపోయాడు. ఈ ఘటనలో ఓ మీడియా కెమెరా మెన్ బైక్ పూర్తిగా కాలిపోయింది. ఒక్కసారిగా తోపులాట జరగడంతో చింత ప్రభాకర్ కాలికి గాయమైంది. దీంతో మెడికల్ కాలేజీ దాకా కొనసాగాల్సిన ర్యాలీ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. తర్వాత లీడర్లు వెళ్లి మెడికల్ కాలేజీని ప్రారంభించారు.