కునో జాతీయ పార్కులో మరో చీతా మృతి

మూడు నెలల్లో మూడో చీతా మృతి

Another cheetah dies at Kuno National Park, third death in three months

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన చీతాలు మృత్యువాత పడుతున్నాయి. మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్కులో ఉంచిన చీతాల్లో మూడు నెలల వ్యవధిల మూడు చీతాలు మృతి చెందాయి. తాజాగా దక్ష అనే ఆడ చీతా మృతి చెందడంతో వాటి సంరక్షణపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. సాషా అనే చీతా మార్చి 27న కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించగా, దక్షిణాఫ్రికాకు చెందిన ఉదయ్ అనే మరో చీతా ఏప్రిల్ 13న మరణించింది. అయితే, దక్ష అనే చీతా మృతికి లైంగిక హింసే కారణమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. అగ్ని, వాయు అనే మగ చీతాలు సంభోగం కోసం దక్ష ఎన్ క్లోజర్లోకి ప్రవేశించాయని అధికారులు చెప్పారు.

సంభోగ సమయంలో మగ చీతాలు ఆడ చీతాలతో హింసాత్మకంగా ప్రవర్తించడం సహజమేనని అన్నారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన దక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిందని తెలిపారు. వైద్యులు అత్యుత్తమ చికిత్స అందించినా ఫలితం లేకపోయిందన్నారు. కాగా, ఈ ఘటన తర్వాత రుతుపవనాలు ప్రారంభానికి ముందు మరో ఐదు చీతాలను అడవిలోకి వదలాలని అధికారులు భావిస్తున్నారు. మిగిలిన వాటిని వర్షాలు కురిసే వరకు కంచెతో కూడిన అలవాటు శిబిరాల్లో ఉంచాలని నిపుణులు నిర్ణయించారు.