తన స్టేట్ మెంట్ ఆధారంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారనడంపై పీవీ రమేశ్ దిగ్భ్రాంతి

సీఐడీ పనితీరుపై అనుమానం వ్యక్తం చేసిన పీవీ రమేశ్

pv-ramesh-reaction-on-skill-scam-case

అమరావతిః స్కిల్ డెవలప్ మెంట్ లో ఆర్థిక శాఖ ఏ తప్పూ చేయలేదని ఆ శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ చేయడంపై మాజీ ఐఏఎస్ తాజాగా స్పందించారు. ఈ కేసులో తన స్టేట్ మెంట్ ఆధారంగానే చంద్రబాబును అరెస్టు చేశారనడంపై పీవీ రమేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిధుల వినియోగంలో అక్రమాలు జరిగితే ప్రధానంగా స్కిల్ డెవలప్ మెంట్ ఎండీ, కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు.

అయితే, సీఐడీ అధికారులు పెట్టిన కేసులో ఎండీ, కార్యదర్శిల పేర్లు లేవని గుర్తుచేశారు. అధికారుల తప్పులను నాయకులకు ఆపాదించడమేంటని నిలదీశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి రోజూ కొన్ని వందల అంశాలను పర్యవేక్షిస్తారని, ఏ బ్యాంకు ఎకౌంట్ లో ఏం జరుగుతుందో వారికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.

స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించి అప్పట్లో తీసుకున్న విధాన నిర్ణయాల వివరాలు, ఫైల్స్ ఎక్కడున్నాయని పీవీ రమేశ్ ప్రశ్నించారు. వాటిని పరిశీలిస్తే నిధుల వినియోగం వివరాలు క్లియర్ గా తెలుస్తాయని అన్నారు. సీఐడీ అధికారుల పనితీరు చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన చెప్పారు. కాగా, ఈ కేసు విచారణలో భాగంగా గతంలో సీఐడీకి పీవీ రమేశ్ లిఖితపూర్వక జవాబులిచ్చారు. ఈ స్టేట్ మెంట్ ను సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకుందని పీవీ రమేశ్ తాజాగా ఆరోపిస్తున్నారు.