ఎస్ఈసీ ఉత్త‌ర్వుల‌ను నిలిపేసిన హైకోర్టు

మున్సిపల్ ఎన్నిక‌ల్లో మళ్లీ నామినేషన్లకు ఎస్ఈసీ అవకాశం

అమరావతి: ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నేప‌థ్యంలో బ‌ల‌వంతంగా నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో పలు ప్రాంతాల్లో మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ ఉత్తర్వులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న తీసుకున్న‌ నిర్ణయానికి వ్య‌తిరేకంగా పలువురు హైకోర్టులో పిటిషన్ వేయ‌గా, దానిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎస్‌ఈసీ ఆదేశాలను నిలుపుదల చేసింది. అంతేకాదు, వాలంటీర్లపై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన ఆదేశాలను కూడా హైకోర్టు నిలిపేస్తూ.. వాలంటీర్ల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకోవద్దని తెలిపింది.

కాగా, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలపై వివిధ పార్టీల నుంచి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు.. ఎన్నిక‌లు జ‌రుగుతోన్న ప‌లు ప్రాంతాల్లో మ‌ళ్లీ నామినేషన్లు దాఖలు చేసేందుకు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అనుమతించారు. ఈ నేప‌థ్యంలో నిన్న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో మ‌ళ్లీ నామినేషన్లు స్వీకరించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/