ఏపీ సర్కార్ కు డెడ్ లైన్ విధించిన ఉద్యోగుల సంఘం

AP employees union imposed a deadline on the AP government

ఏపీ సర్కార్ కు ఉద్యోగుల సంఘం డెడ్ లైన్ విధించింది. ఫిబ్రవరి 05 లోపు తమ డిమాండ్స్ నేరవేర్చాలని లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడం లేదంటూ గత కొద్దీ రోజులుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తో రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. తమ సమస్యల పరిష్కారానికి గవర్నర్ కల్పించుకొని చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు.

ఇక ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత ఏపీ ఉద్యోగుల ఉద్యమం ఉంటుందని హెచ్చరించారు ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఫిట్మెంట్ తగ్గించిన దాఖలాలు లేవు..కొందరు నాయకులు ఉద్యోగులను పలుచన చేసేలా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. జనంలో మమ్మల్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఫిబ్రవరి 5వ తేదీలోపు ఉద్యోగుల డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.