వైస్సార్సీపీ ప్రభుత్వం రెడ్ల రాజ్యం కాదు..బడుగుల రాజ్యం

జగన్ దేవుడి లక్షణాలు కలిగిన వ్యక్తి అంటూ డిప్యూటీ సీఎం వ్యాఖ్య

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ ఫొటోను చేతిలో పట్టుకుని ఆయన తన ఛాంబర్లోకి ప్రవేశించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..జగన్ ఫొటో పట్టుకుని ఛాంబర్లోకి ప్రవేశించడంపై స్పందించారు. జగన్ దేవుడి లక్షణాలు కలిగిన వ్యక్తి అని చెప్పారు. అందుకే జగన్ ఫొటో పట్టుకుని ఛాంబర్లోకి ప్రవేశించానని తెలిపారు. కాళ్లు పట్టుకుంటేనో, కాకా పడితేనో జగన్ పదవులు ఇవ్వరని, పార్టీ కోసం కష్టించి పని చేసే వారికే పదవులు ఇస్తారని చెప్పారు.

తనకు రెండోసారి మంత్రి పదవి దక్కుతుందని అనుకోలేదని అన్నారు. తనకు జగన్ అప్పగించిన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేరుస్తానని చెప్పారు. వైస్సార్సీపీ ప్రభుత్వం అనేది రెడ్ల రాజ్యం కాదని, ఇది బడుగుల రాజ్యమని నారాయణస్వామి అన్నారు. బడుగులకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను చూసి… తాము కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదని రెడ్లు అనుకుంటున్నారని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/