ఒడిశాలో మరో రైలు ఘోరం : కూలీలపైకి దూసుకెళ్లిన రైలు.. నలుగురి మృతి

ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. రీసెంట్ గా కోరమాండల్ రైలు ప్రమాద ఘటన యావత్ ప్రజలను శోకసంద్రంలో పడేసిన సంగతి తెలిసిందే. పది , కాదు వంద కాదు ఏకంగా ఈ ప్రమాదంలో 278 మంది మృతి చెందారు. వెయ్యికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఇప్పటికీ 101 మంది మృత దేహాలు ఎవరివి అనేది గుర్తించలేని పరిస్థితి. ఈ ఘటన గురించి ఇంకా మాట్లాడుకుంటుండగానే మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

ఝాజ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో బుధవారం రోజున కూలీలు పనిచేసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడ భారీ వర్షం రావడంతో తలదాచుకునేందుకు పక్కనే ఎన్నో రోజలుగా పట్టాలపై అగి ఉన్న గూడ్స్ రైలు కిందకు వెళ్లారు.అయితే వర్షం మరింతగా పెరగడం, భారీగా వీచిన ఈదురుగాలులకు గూడ్స్ రైలు ముందుకు కదిలింది.

దీంతో అక్కడికక్కడే ముగ్గురు కూలీలు చనిపోయారు. మరోకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. క్షతగాత్రులను కటక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం నుంచి బయట పడకముందే మళ్లీ అలాంటి ప్రమాదమే జరగడం అందర్నీ షాక్ కు గురిచేస్తుంది.