ఏపిలో టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం
తొలుత టెట్ నిర్వహణ.. ఆపై డీఎస్సీ నిర్వహించే అవకాశం
అమరావతిః ఆంధ్రప్రదేశ్ లో టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదముద్ర వేసింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపట్టాలని సీఎం జగన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఈ ప్రాసెస్ లో భాగంగా తొలుత టెట్ నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. డీఎస్సీలో టెట్ మార్కులు వెయిటేజీ ఉండడంతో తొలుత టెట్ నిర్వహించి, ఫలితాలు వెల్లడించాక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
డీఎస్సీ 2024 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 6,100 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ లో చివరిసారి 2022 లో టెట్ నిర్వహించగా.. 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన వారు దాదాపుగా 2 లక్షల మంది ఉంటారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం టెట్ నిర్వహిస్తే సుమారు 5 లక్షల మంది హాజరవుతారని భావిస్తున్నారు.