బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం

ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం తీసుకుంది. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో, దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం చేసింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు తీర్మానాలనూ కేంద్రానికి పంపుతున్నట్లుగా ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. పాదయాత్రలో ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు తనను కోరారని జగన్ తెలిపారు.

ఈ బిల్లును అసెంబ్లీలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపించాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని బోయ, వాల్మీకిలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారు. పలు రాష్ట్రాల్లో ఈ కులాలు ఎస్టీ జాబితాలో ఉన్నాయి. మెజారిటీ బోయ, వాల్మీకిలో 47 శాతం మందికి భూమి లేదు. 45 శాతం మంది చిన్న సన్నకారు రైతులు. వారి ఆధీనంలో 27 శాతం మాత్రమే నీటి ఆధారితంగా ఉన్నాయి. 73 శాతం వీరి భూములు వర్షాలపై ఆధారపడి ఉన్నాయి. కుటుంబ పెద్దలు నిరక్షరాస్యత 77 శాతం ఉంది. 61 శాతం కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వీరికి కుల సంబంధిత వృత్తి లేని కారణంగా వేసవి కాలంలో వలసలు వెళ్తుంటారు.

దాదాపుగా 79 శాతం కుటుంబాలు రెండు లేదా అంతకంటే తక్కువ గదులు ఉన్న గృహాల్లో నివహిస్తున్నారు. ఇప్పటికీ 16 శాతం పూరిళ్లలో నివసిస్తున్నారు. 45 శాతం మందికి ఇప్పటికీ టాయిలెట్స్‌ లేవు. 80 శాతం కుటుంబాలకు వార్షిక ఆదాయం లక్ష రూపాయల కంటే తక్కువే. దాదాపు 8.6 శాతం కుటుంబాల వార్షిక ఆదాయం రూ.20 వేల కంటే తక్కువ. కుటుంబాలు 39 శాతం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తుంటాయి. 42 శాతం మొత్తం కుటుంబం వలసలు వెళ్లినట్లు తెలిపారు. బోయ, వాల్మీకి సామాజిక వర్గాల్లోని డిమాండ్లను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ సామాజిక వర్గం కర్ణాటకలో ఎస్టీ జాబితాలో చేర్చారు. ఏపీలోని అనంతపురం, కర్నూలు, వైయస్‌ఆర్‌ జిల్లా, చిత్తూరు జిల్లాల్లో బోయ, వాల్మీకిలను షెడ్యూల్‌ తెగల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నాం. వాస్తవాల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోరారు.