కేన్స్‌లో ‘ఉక్రేనియన్ రంగులు’ ధరించిన మహిళ..ఒంటిపై రక్తపు రంగుతో రెడ్‌కార్పెట్‌పై కలకలం

మహిళను వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది

a-person-in-ukrainian-colours-pours-a-red-substance-over-herselves-in-cannes-red-carpet

కేన్స్‌ః ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా ఏడాదికిపైగా యుద్ధం సాగిస్తోంది. దాడులతో తెగబడుతున్న రష్యా సేనలను ఉక్రెయిన్ దీటుగా నిలువరిస్తోంది. ఈ క్రమంలో ఇరు వైపులా భారీ నష్టం సంభవిస్తోంది. అయినప్పటికీ ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. రష్యా దురాక్రమణపై పలువురు అంతర్జాతీయ వేదికలపై గళం విప్పారు. తాజాగా, 76వ కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రక్తాన్ని పోలిన రంగును ఒంటిపై పూసుకున్న ఓ మహిళ రెడ్‌కార్పెట్‌పై నడిచి కలకలం రేపింది.

‘యాసిడ్’ సినిమా ప్రీమియర్ సందర్భంగా ఆదివారం చిత్ర బృందం రెడ్‌కార్పెట్‌పై ఫొటోలకు పోజులిచ్చింది. అదే సమయంలో ఉక్రెయిన్ జాతీయ జెండా రంగులైన నీలం, పసుపు రంగుల దుస్తులో వచ్చిన ఓ మహిళ ఫొటోలకు పోజిచ్చింది. ఆ వెంటనే వెంట తెచ్చుకున్న ఎరుపు రంగును తలపై పోసుకుని శరీరమంతా రాసుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు.

ఆ మహిళ ఎవరన్నదీ తెలియరాలేదు. అయితే, ఆమెను ఉక్రెయిన్ వాసిగా అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు నిరసనగానే ఆమె ఇలా చేసినట్టు తెలుస్తోంది. కాగా, గతేడాది కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇలాగే ఓ మహిళ అనూహ్యంగా నిరసన తెలిపి కలకలం రేపింది.