ఏపీ టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో మరో వ్యక్తి అరెస్ట్‌..

ఏపీ టెన్త్ పేపర్ లీక్ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి నారాయణ ను పోలీసులు అరెస్ట్ చేయగా..ఇప్పుడు మరో వ్యక్తిని అరెస్ట్ చేసారు. ఈ కేసులో ఏ8 గా ఉన్న గంగాధర రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. నారాయణ విద్యాసంస్థల్లో గంగాధరరావు డీన్ గా పనిచేస్తున్నారు. గంగాధరరావు న్యాయమూర్తి ముందు హాజరు కాగా, జుడిషియల్ రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు చిత్తూరు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పదవ తరగతి ప్రశ్నా పత్రాల మాల్ ప్రాక్టీస్ విషయంలో లోతైన దర్యాప్తుకు సన్నద్ధంగా ఉన్నామని, మా విచారణ మరింత వేగవంతం చేశామన్నారు పోలీసులు.

మంగళవారం నారాయణను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి , చిత్తూరుకు తీసుకొచ్చిన పోలీసులు , ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల నిర్వహించారు. అనంతరం నారాయణను మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచగా, పోలీసుల అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు. దీంతో ఆ వాదనలు విన్న న్యాయమూర్తి ఏకీభవించారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.