టర్కీలో మళ్లీ భూకంపం..

టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం టర్కీ తో పాటు సిరియా దేశాల్లో భారీ భూకంపాలు సంభవించగా..మంగళవారం మరోసారి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.6గా నమోదైనట్లు యూరోపియన్ మెడిట్టేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకటించింది. సెంట్రల్ టర్కీ పరిధిలో ఈ భూకంపం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. భూప్రకంపనలకు బిల్డింగ్‌లు, రోడ్లకు బీటలు పడ్డాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం టర్కీ, సిరియాలో వరుస భూకంపాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే నాల్గు వేలకు పైగా మృతదేహాలు బయటకు తీయగా..ఇంకా శిధిలాల కింద మృతదేహాలను వెలికితీత పనులు జరుగుతున్నాయి. వరుస భూకంపాలతో విలవిలలాడుతున్న టర్కీ, సిరియాలకు ప్రపంచ దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. భారత్ ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించగా.. స్పెయిన్ శిథిలాలలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్పిఫర్ డాగ్‌లను పంపించింది.

ఇదిలా ఉంటె టర్కీ లో భూకంపం వస్తుందని 3 రోజుల ముందే పరిశోధకుడు ఫ్రాంక్ హోగర్‌బీట్స్ ఉహించాడు. దక్షిణ మధ్య టర్కీ, జోర్డాన్‌, సిరియా, లెబనాన్‌‌లో భారీ భూకంపం సంభవించే ముప్పు ఉందని 3 రోజుల కిందటే ఆయన హెచ్చరించారు. ఇప్పుడు ఆయన ట్వీట్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సోలార్‌ సిస్టమ్‌ జియోమెట్రీ సర్వే సంస్థలో పరిశోధకుడిగా పనిచేస్తున్నారు ఫ్రాంక్‌ హోగర్‌బీట్స్‌. భూకంపాల తీవ్రతను అధ్యయనం చేస్తుంది ఈ సంస్థ. ‘ఫిబ్రవరి 4 నుంచి 6 మధ్య.. దక్షిణ మధ్య టర్కీ, జోర్డాన్‌, సిరియా, లెబనాన్‌ ప్రాంతాల్లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉంది’ అని ఆయన ఫిబ్రవరి 3న ట్వీట్‌ చేశారు. ఆయన అంచనాలు ఇప్పుడు నిజమయ్యాయి.