ఇండియన్‌ మ్యూజియంకు బాంబు బెదిరింపులు

bomb-squad-at-indian-museum-in-kolkata-after-mail-warns-of-explosives

కోల్‌కతాః కోల్‌కతా లోని ఇండియన్‌ మ్యూజియం కు బాంబు బెదిరింపులు వచ్చాయి. మ్యూజియంలో బాంబు అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సందర్శకుల్ని మ్యూజియం నుంచి బయటకు పంపించేశారు. అనంతరం బాంబ్‌ స్వ్కాడ్‌ బృందాలు మ్యూజియంలో తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో వారికి ఎలాంటి పేలుడు పదార్థాలూ దొరకలేదు. దీంతో బాంబు బెదిరింపు ఈమెయిల్‌ బూటకమని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవలే కాలంలో అమెరికా నుంచి ఇలాంటి మెయిల్స్‌ కొన్ని వస్తున్నట్లు తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వాళ్లు తమకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు మెయిల్‌లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.

కాగా, గత కొన్ని రోజులుగా దేశంలోని పలువురు ప్రముఖులు, పారిశ్రామివేత్తలు, విమానాశ్రయాలు, బ్యాంకులు, ప్రముఖ ఆలయాలకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో ముంబైలోని పలు బ్యాంకులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు ఖిలాఫత్‌ ఇండియా మెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత ఢిల్లీ, జైపూర్‌, లక్నో, చండీగఢ్‌, ముంబై, చెన్నై, అమ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులపై బాంబు దాడి చేయబోతున్నట్లు కొందరు ఆగంతకులు ఈమెయిల్‌ ద్వారా బెదిరించారు. ఇక నిన్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయోధ్యలో నిర్మించిన రామ మందిరం తో సహా పేల్చేస్తామంటూ సీఎంను బెదిరించారు.