జనసేన కౌలు రైతు భరోసాకు అంజనాదేవి సాయం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా పేరిట రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు లక్ష రూపాయిల ఆర్ధిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాలోని రైతులకు ఆర్ధిక సాయం అందజేశారు. ఈ క్రమంలో కౌలు రైతు భరోసాకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. పలు రంగాల ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారు. మెగా ఫ్యామిలీ సభ్యులు కూడా తమవంతు సాయాన్ని పవన్ కళ్యాణ్ కు అందజేయగా, తాజాగా జనసేన కౌలు రైతు భరోసాకు పవన్‌ తల్లి అంజనాదేవి ఆర్థిక సాయం అందించారు. పవన్‌ తండ్రి కొణిదెల వెంకట్రావు జయంతి సందర్భంగా కౌలు రైతు భరోసా యాత్ర ప్రత్యేక నిధికి రూ.లక్షన్నర విరాళం అందజేశారు. పార్టీకి మరో రూ.లక్షల విరాళం ఇచ్చారు.

హైదరాబాద్‌లో పవన్‌ కళ్యాణ్‌కు ఇందుకు సంబంధించిన చెక్కులను అంజనాదేవి అందించారు. తన తండ్రి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయ్యారని గుర్తు చేశారు. తన పెన్షన్‌ డబ్బులను అమ్మ కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కౌలు రైతు కుటుంబాలకు ఈసాయం ఎంతో భరోసాను ఇస్తోందని చెప్పారు.

తన తండ్రి అబ్కారీ శాఖలో పనిచేసేవారని..ఆయనకు వచ్చిన జీతంతోనే తామంతా పెరిగామన్నారు. ఆయన చనిపోయిన తర్వాత అమ్మకు పెన్షన్‌ రావడం మొదలైందని..పెన్షన్‌ డబ్బులను దాచుకోవడం అమ్మకు అలవాటు అని తెలిపారు. ఆ సొమ్మును కౌలు రైతులకు ఇవ్వడం స్ఫూర్తిదాయకమన్నారు.