మోసం చేసారంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ‘నువ్వే కావాలి’ నటుడు

నువ్వే కావాలి , ప్రేమించు తదితర చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి కిరణ్..జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. తన దగ్గర నిర్మాత జాన్‌బాబు, లివింగ్ స్టన్ అప్పు తీసుకొని ఆ డబ్బులు అడిగితే బెదిరిస్తున్నట్లు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసాడు. నిర్మాత జాన్‌బాబు, లివింగ్ స్టన్ తన వద్ద రూ.10.6 లక్షలు అప్పుగా తీసుకుని మోసం చేశారని సాయికిరణ్ ఫిర్యాదు చేశారు. పైగా డబ్బులు అడిగితే తనను బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. నటుడి ఫిర్యాదు మేరకు జాన్‌బాబు, లివింగ్ స్టన్‌లపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక సాయికిరణ్ ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడైన రామకృష్ణ కుమారుడు. ఈటీవీలో ప్రసారమైన శివలీలలు ధారావాహికలో విష్ణువుగా నటించాడు. తరువాత మరికొన్ని ఆధ్యాత్మిక ధారావాహికల్లో కృష్ణుడిగా, వేంకటేశ్వరుడిగా కూడా కనిపించాడు. సాయికిరణ్ హీరోగా, సీరియల్ నటుడిగానే కాకుండానే హైదరాబాద్ బ్లూక్రాస్ సంస్థలో చేరి జంతు సంరక్షణ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు. ఇంకా కొన్ని ఆధ్యాత్మిక సంస్థలలో కూడా సభ్యుడు. శివుడిపై శ్రీవత్సన్ అనే ఆల్బమ్ ను కూడా రూపొందించాడు.