ఎల్లుండి నుంచి పోరాటం ఉద్ధృతం చేస్తాం..ఏపి అంగన్వాడీ ప్రతినిధులు

మా సమస్యలు పరిష్కరించినట్టు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు..అంగన్వాడీ ప్రతినిధులు

Anganwadi strike in AP

అమరావతిః తమ డిమాండ్ల సాధన కోసం ఏపీలో అంగన్వాడీలు గత మూడు వారాలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు నిరసనలు తెలుపుతున్నారు. కాగా, విజయవాడలో ఈరోజు అంగన్వాడీ ప్రతినిధులు సుబ్బరావమ్మ, లలిత మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కరించినట్టు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని అధికారపక్షంపై ధ్వజమెత్తారు. తమకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు చెబుతున్నారని, ఇది కూడా అబద్ధమేనని పేర్కొన్నారు. చర్చలు అంటూనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపించారు. అలాగైతే వచ్చే ఎన్నికల్లో తాము కూడా ప్రత్యామ్నాయం చూసుకుంటామని వారు స్పష్టం చేశారు. ఎల్లుండి నుంచి పోరాటం ఉద్ధృతం చేస్తామని అంగన్వాడీ ప్రతినిధులు వెల్లడించారు.

“అంగన్వాడీ కేంద్రాలకు అద్దెలు, అంగన్వాడీ కార్యకర్తలకు ఫోన్లు ఎవరి కోసం ఇచ్చారు? మా కోసం ఇచ్చారా? ఫోన్లు ఇచ్చినప్పటినుంచి పనిభారం పెరిగింది. అంగన్వాడీ కార్యకర్తలు ఒత్తిళ్లకు గురై బీపీ, షుగర్ వంటి సమ తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అంగన్వాడీలకు వేతనాలు పెంచారు. గ్రాట్యుటీ కూడా చాలా రాష్ట్రాల్లో అమలవుతోంది. ప్రభుత్వ వైఖరితో అంగన్వాడీల్లో మానసిక వేదన పెరిగింది” అంటూ సుబ్బరావమ్మ, లలిత వివరించారు.