తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

వచ్చే నెల 13న పోలింగ్ నిర్వహించనున్న ఈసీ

teachers-mlc-election-schedule-release

హైద‌రాబాద్ :

తెలుగు రాష్ట్రాల్లోని పదిహేను శాసన మండలి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. త్వరలో ఖాళీ కాబోతున్న 6 స్థానాలతో పాటు ఇప్పటికే ఖాళీ అయిన 9 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను గురువారం విడుదల చేసింది. ఈ నెల 16న తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 15 స్థానాల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

నామినేషన్ల దాఖలకు ఫిబ్రవరి 23వ తేదీన గడువుగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 24వరకు గడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 27వ తేదీని గడువుగా నిర్ణయించారు. మార్చి 13న ఈ స్థానాలకు పోలింగ్ నిర్వహించి, మార్చి 16న ఓట్ల లెక్కింపు పూర్తిచేసి ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో 8 స్థానిక సంస్థలు, 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదే‌శ్‌లో ఎమ్మెల్సీలు యండపల్లి శ్రీనివాసులు రెడ్డి ( ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం), వెన్నపూస గోపాలరెడ్డి ( కడప, అనంతపురం, కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గం), మాధవ్‌ (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం), విఠపు బాలసుబ్రహ్మణ్యం ( ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ నియోజక వర్గం), కత్తి నరసింహారెడ్డి ( కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ నియోజక వర్గం) ల పదవీ కాలం ముగిసింది. తెలంగాణలో కాతేపల్లి జనార్థన్ రెడ్డి (మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ) పదవీ కాలం కూడా ముగియనుంది.