అమెరికాలో విషాదం : దుండగుల కాల్పుల్లో ఏపీ యువకుడు దుర్మరణం

Andhra student shot dead in USA

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఏపీకి చెందిన యువకుడు..దుండగుల కాల్పుల్లో మరణించాడు. ఏలూరు లోని అశోక్‌నగర్‌కు చెందిన వీరా సాయేశ్‌ ఎమ్మెస్‌ చేయడానికి అమెరికా వెళ్ళాడు. కొలంబస్‌ ఫ్రాంక్లింటన్‌లోని ఓ షెల్‌ గ్యాస్‌ స్టేషన్‌లో పార్ట్‌ టైం ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 12.50 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం) గ్యాస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుండగా ఇద్దరు దుండగులు అతనిపై కాల్పులు జరిపి నగదు ఎత్తుకెళ్లారు.

కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సాయేశ్‌ను ఓహియోహెల్త్‌ గ్రాండ్‌ మెడికల్‌ సెంటర్‌కు తరలించారు. అయితే అక్కడి చికిత్స పొందుతూ మరణించాడు. సాయిష్ తల్లిదండ్రులు ప్రస్తుతం ఏలూరులో నివాసం ఉంటున్నారు. సాయిష్ మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రెండేళ్ల క్రితం యూఎస్‌ వెళ్లిన సాయిష్‌.. ప్రస్తుతం లాస్ట్ సెమిస్టర్‌ చదువుతున్నాడు. మరో 10 రోజుల్లో ఎంఎస్‌ పూర్తికానుంది. ఇప్పడిప్పుడే కుటుంబ ఆర్థిక సమస్యలను చక్కబెడుతున్నాడు. ఇక తన కుటుంబం సమస్యలు తీరాయని ఆనందించాడు. అలాగే మరో వారం, రెండు వారాల్లో బంక్‌లో ఉద్యోగం మానేద్దామని అనుకుంటున్నాడు.. ఇంతలోనే ఇలా ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.