ఆర్డినెన్స్‌ ఇవ్వడం సాధ్యమైన పని కాదు

Yanamala Rama Krishnudu
Yanamala Rama Krishnudu

అమరావతి: ఏపి రాజధానులపై శాసన మండలిలో జరిగిన పరిణామాలపై టిడిపి సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెలెక్ట్‌ కమిటీకి బిల్లును పంపాక ఆర్డినెన్స్‌ ఇవ్వడం అనేది అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు సుప్రీంకోర్టు నిబంధనలకు ఇది విరుద్ధమని అన్నారు. మండలిలో మేం అడిగిన సెలెక్ట్‌ కమిటీ కేవలం మండలికి సంబంధించి మాత్రమే. జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీ అడగలేదు. ఒకవేళ జాయింట్‌ కమిటీ అడిగివుంటే అందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉంటారు. గతంలో తాను సెలెక్ట్‌ కమిటీ చైర్మన్‌ గా పనిచేశానని యనమల చెప్పారు. సెలెక్ట్‌ కమిటీ నిర్ణయానికి కనీసం మూడునెలల సమయం పడుతుంది. అలాగని 3 నెలల్లోపు ఇమ్మని కాదు. సెలెక్ట్‌ కమిటీలో ప్రజాభిప్రాయం కూడా తీసుకోవచ్చు. అన్ని ప్రాంతాల్లో పర్యటించి అందరి అభిప్రాయాలు సేకరించడానికి సెలెక్ట్‌ కమిటీకి తగినంత సమయం అవసరం అని యనమల పేర్కొన్నారు. శాసనమండలికి నిన్న కొంతమంది సభ్యులు తాగి వచ్చారని యనమల రామకృష్ణుడు అన్నారు. గుట్కాలు నమిలారని… చైర్మన్‌ను దూషించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేష్‌పై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. టీడీపీ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించిందని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది మంత్రులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారని… దుశ్చర్యలకు పాల్పడ్డారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/