సొరంగంలోని కార్మికులను కాపాడిన సిబ్బందికి ధన్యవాదాలుః ఆనంద్ మహీంద్రా

ఏ క్రీడా విజయం ఇవ్వలేని ఆనందాన్ని దేశప్రజలకు ఇచ్చారని వ్యాఖ్య

Anand Mahindra
Anand Mahindra

న్యూఢిల్లీః ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావడంపై దేశవ్యాప్తంగా సంబరం వెల్లివిరుస్తోంది. కార్మికులను కాపాడేందుకు తలపెట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకున్న ప్రతిఒక్కరికీ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

‘‘ఇది కృతజ్ఞత తెలపాల్సిన సమయం. టన్నెల్‌లో చిక్కుకుపోయిన 41 మందిని కాపాడేందుకు 17 రోజుల పాటు నిర్విరామంగా పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏ క్రీడా విజయం ఇవ్వలేని ఆనందాన్ని మీరు దేశప్రజలకు అందించారు. ఆశలు సాకారం చేశారు. అందరం కలిసికట్టుగా శ్రమిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని, బయటపడలేనంత లోతైన సొరంగం ఏదీ ఉండదని మీరు నిరూపించారు’’ అని ట్వీట్ చేశారు. నెటిజన్లు కూడా ఆనంద్ మహీంద్రాతో ఏకీభవించారు. కార్మికుల కళ్లల్లో ఆనందం చూస్తుంటే కడుపు నిండిపోయిందని పలువురు హర్షం వ్యక్తం చేశారు.