పార్లమెంట్ నూతన భవన వీడియో ను షేర్ చేసిన అమిత్ షా

మే 28వ తేదీన చారిత్రాత్మకంగా నిర్మించిన పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోడీ ప్రారభించబోతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పార్లమెంట్ నూతన భవన వీడియో ను కేంద్రమంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

‘‘పార్లమెంట్ నూతన భవనం ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా చేస్తుంది. పార్లమెంట్ కొత్త భవనంలోని ఈ అద్భుతమైన విశేషాలను చూసి యావత్ దేశం సంతోషిస్తోంది. మన దేశ సంస్కృతి, ఆధునికత కలబోతకు ఇదొక నిదర్శనం. ఈ వీడియోని మీదైన అభిప్రాయాలతో షేర్ చేయాలని అభ్యర్థిస్తున్నాను. అది మీ ఆలోచనలు తెలిసేలా ఉండాలి. అటువంటి వాటిల్లో కొన్నింటిని నేను రీట్వీట్ చేస్తాను’’ అని ట్వీట్ చేశారు.

రెండు విడతల్లో పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఉదయం పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం ప్రారంభోత్సవం జరుగుతుంది. ఉదయం 7.30 గంటల నుంచే పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. తమిళనాడు నుంచి వచ్చిన వేదపండితులు ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ఉభయ సభల ఎంపీలకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉభయ సభాపతులతో పాటు మాజీ లోక్‌సభ స్పీకర్లకు, రాజ్య సభా చైర్మన్లకు కేంద్రం ఆహ్వానాలు పంపింది. అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, సినీ తారలు, క్రీడాకారులతో సహా కొంతమంది ప్రముఖులకు కూడా కేంద్రం ఆహ్వానం పంపింది. కొత్త పార్లమెంట్ భవనం యొక్క చీఫ్ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకి పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందించారు.