కేసీఆర్ కు కొడుకుపై ఉన్న ధ్యాస.. యువతకు ఉపాధి కల్పించాలన్న విషయంపై లేదు – అమిత్ షా

సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన బిజెపి ప్రజా సంకల్ప సభలో కేంద్ర మంత్రి అమిత్ షా..ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌కు తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయటంపై ఉన్న ధ్యాస.. యువతకు ఉపాధి కల్పించాలన్న విషయంపై లేదని విమర్శించారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో కేసీఆర్‌ ఒక్కసారైనా సచివాలయానికి వెళ్లారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు బిజెపికి ఒక్కసారి అవకాశమివ్వాలని కోరారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం బిజెపిదే అన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తాము మద్దతిచ్చినట్లు అమిత్​ షా గుర్తు చేశారు. గతంలో తాము మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. హైదరాబాద్‌ విమోచన దినాన్ని కేసీఆర్‌ వ్యతిరేకించారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ కారు స్టీరింగ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ చేతుల్లో ఉందని ఆక్షేపించారు.

ఇక జెపి నడ్డా మాట్లాడుతూ..కేసీఆర్ అవినీతి, అసమర్థ పాలనతో విసిగిపోయిన జనం ఆయనను గద్దె దింపాలని చూస్తున్నారని అన్నారు. అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రిని ఇంట్లో కూర్చోబెట్టి బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ఖాయమని నడ్డా ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న తన మాటను ప్రజలు నిజం చేశారని, దుబ్బాకలో రఘునందన్, హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ను గెలిపించి బీజేపీకి మరింత బలం ఇచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రజల అభిమానం చూస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించడం ఖాయమన్న నమ్మకం కలుగుతోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంగా మారిందని నడ్డా ఆరోపించారు. స్వరాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రాలేదని, కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడికి మాత్రమే ఉద్యోగాలు దక్కాయని సటైర్ వేశారు. ఈ పరిస్థితి మారాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారును తీసుకు రావాలని పిలుపునిచ్చారు.