మంత్రి సత్యవతికి చేదు అనుభవం

మంత్రి సత్యవతి రాథోడ్ కు ములుగు జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. ములుగు గట్టమ్మ దేవాలయం, మేడారం సమ్మక్క-సారలమ్మలకు బతుకుమ్మ చీరలు సమర్పించే కార్యక్రమానికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు దూరంగా ఉన్నారు. దళిత బంధు స్కీంలో లబ్దిదారుల ఎంపికలో పార్టీ కార్యకర్తలు, పేదలు అన్యాయం జరుగుతున్నా మంత్రి పట్టించుకోవడం లేదంటూ వారంతా మంత్రి పర్యటనకు దూరంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి సత్యవతి రాథోడ్, జిల్లా ZP చైర్మన్ కుసుమ జగదీశ్ తప్ప ఎవరూ హాజరుకాలేదు.

ఇక ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ..దేశంలో మహిళల కోసం అత్యధికంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను సమాన దృష్టితో చూస్తూ వారు సగర్వంగా జీవించేలా సీఎం కేసీఆర్‌ చేస్తున్నారని వెల్లడించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన ఆడబిడ్డలందరికీ సీఎం కేసీఆర్‌ బతుకమ్మ చీరలను కానుకగా అందిస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఏడాది బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం రూ.339 కోట్లు వెచ్చిస్తున్నది చెప్పారు. 10 రంగులు 18 డిజైన్లలో 200 రకాల చీరలను ఆడబిడ్డలకు అందిస్తున్నామని తెలిపారు. బతుకమ్మ చీరలతో నేతన్నల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. రాజకీయ లబ్దికోసం ప్రతిపక్ష నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా ప్రశ్నించారు.