ప్రారంభోత్సవానికి సిద్ధమైన అంబేద్కర్ స్మృతి వనం

ఏపి సర్కార్ రూ.400కోట్ల రుపాయల ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులతో నిర్మిస్తోన్న 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. విజయవాడలో అత్యంత సుందరంగా నిర్మాణం అవుతోంది. ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా.. పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది.. అయితే ఈ నెల 19వ తేదీన ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఇక, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి.. తనిఖీల్లో కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కూడా పాల్గొన్నారు.. అక్కడ జరుగుతోన్న పనులను పరిశీలించి.. పెండింగ్‌లో ఉన్న మిగతా పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

దేశంలోనే అత్యంత ఖరీదైన అంబేడ్కర్‌ స్మృతి వనాన్ని ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేస్తోంది. అంచనాలకు రెట్టింపు ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేశారు. రెండేళ్ల క్రితమే అంబేడ్కర్‌ స్మృతి వనం పనులు పూర్తివ కావాల్సి ఉన్నా కోవిడ్ ఆంక్షలు, నిధుల విడుదలలో జాప్యం, ఆకృతులు ఖరారు కాకపోవడం వంటి కారణాలతో తీవ్ర జాప్యం జరిగింది.

గత ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో 125అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించే సమయానికి విజయవాడ విగ్రహం పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి. రెండు విగ్రహాలను ఒకే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది. తెలంగాణలో దాదాపు 200కోట్ల రుపాయలతో విగ్రహ నిర్మాణం, మ్యూజియం, ఇతర పనుల్ని పూర్తి చేశారు. ఏపీలో మాత్రం 125 అడుగల విగ్రహం, 80 అడుగల ఎత్తున పీఠం, కాన్ఫరెన్స్‌ హాల్స్‌, మ్యూజియం, థియేటర్లు, ల్యాండ్‌ స్కేపింగ్ ఇతర పనులకు దాదాపు రూ.400కోట్ల రుపాయలు ఖర్చు చేశారు.