అదానీకి ప్రభుత్వ సంస్థలను ధారాదత్తం చేస్తున్నారు : కవిత

కార్పొరేట్లకు అనుకూలంగా మోడీ వ్యవహరిస్తున్నారన్న కవిత

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ పై మండిపడ్డారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం రూ. 1,000 కోట్లను ఖర్చు చేస్తోందని… కేంద్ర ప్రభుత్వం మాత్రం లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్ముకుంటోందని ఆమె విమర్శించారు. కార్పొరేట్లకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. లక్షల కోట్ల విలువైన ఎయిరిండియా సంస్థను కేవలం కొన్ని వేల కోట్లకే అమ్మేశారని దుయ్యబట్టారు. వ్యాపారవేత్త అదానీకి ప్రభుత్వ సంస్థలన్నింటినీ ధారాదత్తం చేస్తున్నారని కవిత విమర్శించారు. మోడీ అండతో అదానీ భారత ప్రధాని మాదిరి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కార్మికులకు లబ్ధిని చేకూర్చే 40 చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసేసిందని.. కార్మికులకు అన్యాయం చేసే నాలుగు చట్టాలను తీసుకొచ్చిందని కవిత విమర్శించారు. కార్మికుల హక్కుల కోసం టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని చెప్పారు. ఢిల్లీలో రైతులు చేసిన పోరాటాలను కార్మికులు స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలని.. అప్పుడే మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటుందని అన్నారు.

ప్రజలను మోడీ ప్రభుత్వం మోసం చేస్తోందని… ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట చెపుతుందని కవిత విమర్శించారు. ఎన్నికల ముందు వరకు ఇచ్చిన రేషన్ ను… ఎన్నికల తర్వాత కట్ చేశారని అన్నారు. మోడీ ఎప్పుడూ ఎన్నికల మోడ్ లోనో లేదా ఏరో ప్లేన్ మోడ్ లోనే ఉంటారని చెప్పారు. ఎన్నికల ప్రచారం లేకపోతే… ఆయన విదేశీ పర్యటనల్లో ఉంటారని ఎద్దేవా చేశారు. మోడీ పాలనలో పేదలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/