దర్శకుడు శంకర్‌కు హైకోర్టులో భారీ ఊరట..

స్టార్ డైరెక్టర్ శంకర్ కు తెలంగాణ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం శంకర్ కు స్టూడియో నిర్మాణం కోసం భూమిని కేటాయించడం ఫై కోర్ట్ లో పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. శంకర్‌కు స్టూడియో నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే తప్పేమిటని ప్రశ్నించింది. భూకేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని, ఒక్కో అవసరానికి ఒక్కో విధానం ఉటుందని అభిప్రాయపడింది.

ప్రభుత్వం సినీ కళాకారులకు, క్రీడాకారులకు భూములను కేటాయిస్తుందని, ఇందులో తప్పుపట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిలా గ్రామంలోని సర్వే నం.8లో ఎకరం రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలను దర్శకుడు శంకర్‌కు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ కరీంనగర్‌కు చెందిన జే శంకర్‌ 2020లో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీతో కూడిన ధర్మాసనం ఎదుట వాదనలు పూర్తి కావడంతో తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. ఆ మేరకు హైకోర్టు ఈరోజు భూ కేటాంయిపును సమర్థిస్తూ ఆ కేటాయింపునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.

ప్రస్తుతం శంకర్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా..థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.