అమరావతి దెయ్యాల రాజ‌ధాని – ఏపీ మంత్రి అమ‌ర్‌నాథ్‌

రాష్ట్ర రాజధాని అమ‌రావ‌తిపై వైస్సార్సీపీ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తి దేవ‌త‌ల రాజ‌ధాని కాదు ..దెయ్యాల రాజ‌ధాని అని అన్నారు. రాష్ట్రానికి మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు సంబంధించి కొత్త బిల్లును తీసుకొస్తామన్నారు. అమ‌రావ‌తి నిర్మాణానికి భూములు ఇచ్చిన రాజ‌ధాని రైతులు నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన మ‌హాపాద‌యాత్ర‌కు హైకోర్టు అనుమ‌తి ఇచ్చిన నేప‌థ్యంలో ఆ తీర్పును స్వాగ‌తిస్తూ ప‌లువురు వ్యాఖ్య‌లు చేసిన నేపథ్యంలో వాటిపై స్పందించేందుకు మీడియా ముందుకు వ‌చ్చిన సంద‌ర్భంగా శుక్ర‌వారం అమ‌ర్‌నాథ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ స‌మావేశాల్లోనే మూడు రాజ‌ధానుల బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని అమ‌ర్‌నాథ్ అన్నారు. ఇదివ‌ర‌కు ప్ర‌తిపాదించిన బిల్లుపై ప‌లు అభ్యంత‌రాలు వ్య‌క్త‌మైన నేప‌థ్యంలో కొత్త బిల్లును తీసుకువ‌స్తున్న‌ట్లుగా ఆయ‌న అన్నారు.

అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు చేపట్టిన రాజధాని రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. గురువారం రాత్రి ఈ పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ డీజీపీ ఉత్తర్వులు విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేసిన పిటిషన్‌ను శుక్రవారం మొదటికేసుగా విచారించింది హైకోర్టు. రాజకీయ నాయకులు వేల మందితో పాదయాత్ర చేయొచ్చు కానీ.. 600 మంది రైతుల చేయకూడదా అని పోలీసులను ధర్మాసనం ప్రశ్నించింది. ఢిల్లీలో సమస్యలపై వేలాది మంది ర్యాలీలు చేస్తుంటే.. అక్కడి పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారని.. ఇక్కడ 35 వేల మంది రైతుల్లో కేవలం 600 మంది చేస్తున్న పాదయాత్రకు బందోబస్తు కల్పించలేరా అని సీరియస్ కామెంట్స్ చేసింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగించవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.