హిజాబ్ వివాదం.. కర్ణాటక విద్యార్థినిపై అల్‌ఖైదా చీఫ్ ప్రశంసలు

ముస్కాన్‌కు అల్లా శుభం చేయాలంటూ ఓ పద్యం చదివి వినిపించిన జవహరి

న్యూఢిల్లీ : ఇటీవల కర్ణాటకలో తలెత్తిన హిజాబ్ వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా భావిస్తోంది. హిజాబ్ ధరించిన విద్యార్థులను కాలేజీలోకి వెళ్లకుండా అడ్డుకున్న వారిని ఎదిరించిన విద్యార్థిని ముస్కాన్‌ ఖాన్‌ను ప్రశంసిస్తూ ఆ సంస్థ అధినేత అయ్‌మన్ అల్ జవహరి ఓ వీడియోను విడుదల చేశాడు. అంతేకాదు, విద్యార్థినిని కొనియాడుతూ ఓ పద్యం కూడా చదివి వినిపించాడు. దానిని తానే రాశానని చెప్పుకొచ్చాడు.

హిందూ భారత్ వాస్తవికతను బయటపెట్టిన ముస్కాన్‌కు అల్లా శుభం చేయాలని, భారత హిందూ ప్రజాస్వామ్యమనే ఎండమావిని చూసి మనం మోసపోవడం ఆగిపోవాలని, మనల్ని ఆవహించిన భ్రమలు తొలగిపోవాలని, హిందూ ప్రజాస్వామ్యం అనేది ముస్లింలను అణచివేసే సాధనం తప్ప మరోటి కాదని అర్థం వచ్చేలా ఆ పద్యం ఉంది.

కాగా , ఈ వీడియోపై ముస్కాన్ తండ్రి హుస్సేన్ స్పందించారు. అల్ జవహరి ఎవరో తమకు తెలియదని, తొలిసారి అతడిని ఈ వీడియోలోనే చూశామని అన్నారు. అరబిక్‌లో ఆయనేదో అన్నారని పేర్కొన్నారు. తాము ఇక్కడ ప్రేమ, విశ్వాసంతో కలిసిమెలసి జీవిస్తున్నామన్నారు. ఆయనతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని, ఆయన గురించి మాట్లాడాలనుకోవడం లేదని అన్నారు. కాగా, 8.43 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఉన్నది జవహరియేనని ‘సైట్’ అనే అమెరికా నిఘా సంస్థ నిర్ధారించింది.

మరోపక్క ఈ వీడియోపై కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందించారు. హిజాబ్ వివాదం వెనక అదృశ్య శక్తుల హస్తం ఉన్నట్టు ఈ వీడియోతో అర్థమైందన్నారు. తాజా పరిణామాలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచాలని కోరారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/