ఇస్లాం కంటే హిందుత్వం పురాతనమైనదిః గులాం నబీ ఆజాద్

ఈ దేశంలో పుట్టిన వారంతా మొదట హిందువులేనని స్పష్టీకరణ

Everyone was born a Hindu in this country, Hinduism the oldest religion, says Ghulam Nabi Azad

శ్రీనగర్‌ః కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో హిందూమతమే అతి పురాతనమైనదని, ఇస్లాం కంటే చాలాకాలం ముందు నుంచీ అది ఉందన్నారు. ఈ దేశంలో పుట్టిన వారంతా తొలుత హిందువులేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇస్లాం భారతదేశానికి కొన్నేళ్ల కిందట మాత్రమే వచ్చింది. కానీ హిందూమతం పురాతనమైనది. కాబట్టి ముస్లింలలో పది లేదా ఇరవై మంది బయటి నుండి వచ్చిన వారై ఉండాలి. మిగిలిన వారంతా హిందుత్వం నుండి ముస్లింలుగా కన్వర్ట్ అయినవారు’ అన్నారు. ఇస్లాం మతం 1500 సంవత్సరాల క్రితం వచ్చిందన్నారు.

జమ్ము కశ్మీర్‌లోని డోదా జిల్లా తాల్హ్రీ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… 600 సంవత్సరాల క్రితం కశ్మీర్‌లో ఒక్క ముస్లీం కూడా లేరని, ఇక్కడి పండిట్స్‌లో చాలామంది ముస్లింలుగా మారిపోయారని వ్యాఖ్యానించారు. ఇక్కడి వారంతా కూడా హిందూమతంలోనే జన్మించారన్నారు. అయితే హిందువులైనా, ముస్లింలైనా, రాజ్‌పుట్‌లు అయినా, దళితులైనా, కశ్మీరీలైనా, గుజ్జర్‌లు అయినా.. ఈ దేశమే మన ఇల్లు కాబట్టి ఒక్కటిగా ఉండాలన్నారు. ఇక్కడికి ఎవరూ కూడా బయటి నుండి రాలేదని, అందరూ ఇక్కడి వారేనన్నారు. మనమంతా ఇదే మట్టిపై పుట్టామని, ఇదే మట్టిపై మరణిస్తామన్నారు. మొఘల్ సైన్యంలో భాగంగా ముస్లింలు భారత్ కు వచ్చారని, ఆ తర్వాత మతమార్పిడులు జరిగాయన్నారు.

తాను పార్లమెంటులో ఎన్నో విషయాలు మాట్లాడానని, కానీ అవన్నీ మీ వరకు రాకపోయి ఉండవచ్చునని అక్కడున్న వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ దేశానికి మీరు బయటి నుండి వచ్చారని ఓ సారి ఓ బీజేపీ నేత వ్యాఖ్యానించారని, దానికి తాను మాట్లాడుతూ… ఎవరూ బయటి నుండి రాలేదని, అందరూ ఇక్కడి వారేనని చెప్పానని, ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం వచ్చి 1500 సంవత్సరాలు మాత్రమే అవుతోందని, కానీ హిందుత్వం పురాతనమైనదని తాను సమాధానం ఇచ్చానని గుర్తు చేసుకున్నారు.