ధనబలం అనే పెద్ద రాక్షసితో పోరాడలేను..పుదుచ్చేరి ఏకైక మహిళా మంత్రి రాజీనామా

రాజకీయాలు డబ్బుమయంగా మారిపోయాయని ఆవేదన

Lone Puducherry woman minister quits citing ‘casteism’ and ‘gender bias’

పుదుచ్చేరి : రాజకీయాలు కుట్రలతో నిండిపోయాయని, డబ్బుమయంగా మారిపోయాయని ఆరోపిస్తూ పుదుచ్చేరి ఏకైక మహిళా మంత్రి ఎస్ చందిర ప్రియాంగ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఏఐఎన్ఆర్‌సీ-బిజెపి కూటమి అధికారంలో ఉంది. రాజకీయాల్లో కులతత్వం పెరిగిపోయిందని, లింగ వివక్ష సర్వసాధారణంగా మారిపోయిందని ఆమె ఆరోపించారు. ఆమె రాజీనామాపై స్పందించేందుకు ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నిరాకరించారు. ప్రియాంగ రాజీనామాపై అడిగేందుకు ఆయన చాంబర్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై రంగస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆహ్వానించకుండా ఎందుకు వచ్చారని వారిపై కస్సుమన్నారు.

నెడుంకాడు నుంచి ఏఐఎన్ఆర్‌సీ టికెట్‌పై ఎమ్మెల్యే అయిన ప్రియాంగ 2021లో రవాణా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఫలితంగా 40 సంవత్సరాల తర్వాత ఈ కేంద్రపాలిత ప్రాంతానికి మంత్రి అయిన తొలి మహిళగా రికార్డులకెక్కారు. కాగా, ప్రియాంగ తన రాజీనామా లేఖను తన కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయంలో అందజేశారు.

నియోజకవర్గ ప్రజల్లో తనపై ఉన్న ఆదరణను చూసి రాజకీయాల్లోకి వచ్చానని ఆ లేఖలో పేర్కొన్న ప్రియాంగ.. కుట్ర రాజకీయాలను అధిగమించడం అంత సులభం కాదని తర్వాత అర్థమైందని పేర్కొన్నారు. ధనబలం అనే పెద్ద రాక్షసితో తాను పోరాడలేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు, కులతత్వం, లింగ వివక్షకు లోనయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.