రాకేష్ అంతిమయాత్ర లో ఉద్రికత్త..BSNL ఆఫీస్ ఫై రాళ్ల దాడి

శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఆర్పీఎఫ్ జ‌రిపిన‌ కాల్పుల్లో మృతి చెందిన రాకేష్..అంతిమ యాత్ర లో ఉద్రికత్త చోటుచేసుకుంది. వరంగల్ ఎంజీఎం నుంచి రాకేష్ అంతిమయాత్ర ప్రారంభమైంది. అంతిమయాత్రలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎస్పీ, వామపక్ష కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాగా ఈ అంతిమయాత్ర లో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ క్రమంలో వరంగల్ BSNL ఆఫీస్ మీదుగా అంతిమయాత్ర కొనసాగుతుండగా..ఒక్కసారిగా విద్యార్థులు BSNL ఆఫీస్ ఫై రాళ్ల దాడి చేసారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రికత్త చోటుచేసుకుంది. పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు.

వ‌రంగ‌ల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం మారుమూల డబీర్‌పేట గ్రామానికి చెందిన దామెర కుమార స్వామి, పూలమ్మ దంప‌తుల కొడుకు రాకేశ్ (21) హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌)లో పనిచేస్తున్న తన అక్క సంగీత నుంచి ప్రేరణ పొంది ఆర్మీలో చేరాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు.

దామెర రాకేశ్‌..రెండుసార్లు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలకు హాజరయ్యాడు. చిన్న కార‌ణం వ‌ల్ల ఉద్యోగం కోల్పోయాడు. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా మ‌ళ్లీ ప్ర‌య‌త్నించాడు. ఇటీవలే ఫిజికల్ టెస్ట్‌లలో ఉత్తీర్ణత సాధించాడు. ఎంపిక ప్రక్రియ కోసం వేచి చూస్తున్నాడు. అయితే అగ్నిపథ్ స్కీం ద్వారానే రిక్రూట్‌మెంట్‌ జరుగుతుందని తెలియగానే తీవ్ర మనస్తాపానికి గుర‌య్యాడు. హన్మకొండకు చెందిన మరో 14 మందితో కలిసి నిర‌స‌న తెలిపేందుకు హైద‌రాబాద్‌కు చేరుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఆర్పీఎఫ్ పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పాయాడు.