బస్సుల కోసం రహదారిపై ఆందోళనకు దిగిన ప్రయాణికులు

తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు కీలక హామీలను నెరవేర్చిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి మహాలక్ష్మి. మహాలక్ష్మి పధకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. దీంతో మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తున్నారు. ఇక సెలవు దినాల్లో రాష్ట్రంలో ఆలయాలకు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ఈరోజు కూడా అలాగే పలు ఆలయాలను దర్శించుకున్నారు.

ఆదివారం ఏడుపాయల టీ జంక్షన్ వద్ద రద్దీ నెలకొంది. ఉదయం సమయంలో అమ్మవారి దర్శనానికి సంగారెడ్డి హైదరాబాద్ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సాయంత్రం తిరుగు ముఖం పట్టారు సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు మెదక్ వైపు నుంచి సంగారెడ్డి సికింద్రాబాద్ వైపుకు వెళ్లే బస్సులు నిండుగా రావడంతో పోతంశెట్టిపల్లి టీ జంక్షన్ వద్ద బస్సులు నిలపలేదు.

దీంతో ప్రయాణికులు మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై రహదారిపై ఆందోళనకు దిగారు . వీరిలో అధిక సంఖ్యలో మహిళలే ఉన్నారు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం వసతి కల్పించడంతో అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు తిరుగు ప్రయాణంలో బస్సులు నిలపకపోవడంతో ఎలా వెళ్లాలని ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన కొల్చారం పోలీసులు టీ జంక్షన్ వద్దకు వచ్చి ఆర్టీసీ మెదక్ ఆర్టీసీ డీఎంతో మాట్లాడి ప్రత్యేకంగా నాలుగు బస్సులను ఏర్పాటు చేయడంతో విషయం సద్దుమణిగింది.