తెలంగాణ రైతులకు తీపి కబురు తెలిపిన కేంద్రం

గత కొద్దీ రోజులుగా వరి కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కు కేంద్రానికి మధ్య చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లి బిజెపి మంత్రులను కలిసి వరి కొనుగోలు విషయం గురించి మాట్లాడడం జరిగింది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు , ప్రభుత్వానికి ఓ గుడ్ న్యూస్ అందించారు.

తాజాగా ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అదనంగా బియ్యం సేకరించేందుకు ఓకే చెప్పింది కేంద్రం. మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీనికి సంబంధించి కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ నుంచి కేంద్రం మొత్తం 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనుంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం 68.65 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించనుంది. వాస్తవానికి ముందుగా కేంద్రం తెలంగాణ రాష్ట్రం నుండి 40 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే కేంద్రం తీసుకుంటానని చెప్పింది. ప్రస్తుతం అదనంగా మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనుంది. మొత్తం కలిసి 46 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించనుంది కేంద్రం. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.