దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా బంద్‌కు పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్ మోర్చా
బంద్‌కు సంఘీభావంగా మధ్యాహ్నం వరకు బస్సులు నిలిపేస్తున్నట్టు ప్రకటించిన ఏపీ

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు నేడు దేశవ్యాప్తంగా బంద్ ప్రారంభమైంది. కాంగ్రెస్, వామపక్షాలు, ఎస్పీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, టీడీపీ సహా పలు రైతు సంఘాలు ఈ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో పోలీసులు దేశవ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసన శిబిరాల నుంచి రైతులు ఢిల్లీకి రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇండియా గేట్, విజయ్ చౌక్ సహా పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇక ఏపీలోనూ బంద్ కొనసాగుతోంది. బంద్‌కు అధికార వైస్సార్సీపీ మద్దతు ప్రకటించడంతో గత రాత్రి నుంచే ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. నేటి మధ్యాహ్నం వరకు బస్సులను నిలిపివేసి బంద్‌కు సంఘీభావం ప్రకటిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

మరోవైపు, తెలంగాణలోనూ బంద్ ప్రారంభమైంది. పలు జిల్లాల్లో బస్సులు నిలిచిపోయాయి. హనుమకొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్, షాద్‌నగర్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్, వామపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలో 842 బస్సులు నిలిచిపోయాయి. రోడ్లపై బైఠాయించిన నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేటి సాయంత్రం 4 గంటల వరకు బంద్ కొనసాగుతుందని, బంద్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చినట్టు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/