ఆచార్య, విరాటపర్వంకు ‘నక్సల్’ దెబ్బ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే షూటింగ్ మెజారిటీ శాతం పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను వేసవి కానుకగా మే 13న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కేమియో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తున్న ఇటీవల రిలీజైన పోస్టర్స్ చూస్తూ మనకు అర్థం అవుతంది.

అటు నక్సల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న మరో చిత్రం ‘విరాటపర్వం’ కూడా ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, ఈ సినిమా పూర్తిగా నక్సల్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ఈ చిత్ర టీజర్‌లో మనకు చూపించారు. అయితే ఇప్పుడు ఈ ‘నక్సల్’ నేపథ్యం ఈ రెండు సినిమాలకు పెద్ద అడ్డంకిగా మారింది. ఈ రెండు చిత్రాలు కూడా నక్సలిజం‌ను ప్రోత్సహించే విధంగా ఉన్నాయంటూ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు అందింది.

హైదరాబాద్‌కు చెందిన యాంటీ టెర్రరిజం ఫోరం అనే సంస్థ ఈ ఫిర్యాదు చేసింది. ఈ రెండు సినిమాలు కూడా హింసను ప్రోత్సహించే విధంగా నక్సల్ నేపథ్యంలో సాగుతున్నాయని, అందుకే ఈ రెండు సినిమాలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఈ రెండు సినిమాలకు సెన్సార్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని సినీ విమర్శకులు అంటున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.