హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ

ఈ ఏడాది వర్సిటీలో విద్యార్థి సంఘాల ఎన్నికలు

ABVP-SFI students clash at Hyderabad university, injuries reported

హైదరాబాద్‌ః హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విద్యార్థి విభాగం ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ మధ్య శనివారం ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువైపుల వారు దాడి చేసుకున్నారు. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది.

వర్సిటీ క్యాంపస్ డోర్లు, అద్దాలు ధ్వంసమైన దృశ్యాలను చూస్తే గొడవ పెద్దదిగానే కనిపిస్తోంది. గాయపడిన విద్యార్థులను అంబులెన్స్ ల సాయంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడికి సంబంధించి ఎస్ఎఫ్ఐ వర్గంపై ఏబీవీపీ ఆరోపణలు గుప్పించింది. తమ గ్రూపులోని గిరిజన విద్యార్థులపై ఎస్ఎఫ్ఐ వర్గీయులు దాడి చేసి కొట్టినట్టు ఆరోపించింది. పదునైన ఆయుధాలతో దాడి చేసినట్టు పేర్కొంది. ఈ ఏడాది విద్యార్థి సంఘాల ఎన్నికలను యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ తరుణంలో దాడి జరగడం గమనార్హం.