అమరావతి అంశంలో సుప్రీం కోర్ట్ ఆదేశాల ఫై సజ్జల కీలక వ్యాఖ్యలు

వికేంద్రీకరణను అడ్డుకోవాలని కుట్రలు చేసిన వారికి సుప్రీం కోర్టు వ్యాఖ్యలు గట్టి మొట్టికాయల్లాంటివన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మూడు రాజధానుల అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భిన్న తీర్పులు వచ్చాయని గుర్తు చేశారు. అయితే ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల రాష్ట్రానికి నష్టం కలుగుతుందని, సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో డిసెంబర్‌ 5న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు సజ్జల అన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఏపీ‌ ప్రజలు మద్దతు ఇస్తున్నారని, స్వాగతిస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో చట్టం కూడా సీఎం జగన్‌కు సహకరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

‘జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకొని, మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని తలపెట్టి చట్టం చేసినప్పుడు.. దాని తరువాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా వికేంద్రీకరణకు అనుగుణంగా, సీఎం వైయస్‌ జగన్‌కు మద్దతుగా నిలిచారని తేటతెల్లమైంది. వికేంద్రీకరణను అడ్డుకునేందుకు సాంకేతికపరమైన కారణాలు, వ్యవస్థల్లో చొరబడైనా ఏదో ఒక రకంగా చేయాలనే కుట్రలకు సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు గట్టి మొట్టికాయల్లాంటివి’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.