పంచాయతీలే దేశాభ్యున్నతికి పట్టుగొమ్మలు

గ్రామాభివృద్ధికి పాటుపడే నాయకుణ్ణి ఎన్నుకోవాల్సిన అవశ్యకత

Panchayati Office-File
Panchayati Office-File


గ్రామాభివృద్ధికి అవసరమైన వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయా గ్రామ ప్రజలదే. ఎన్నికల కోసం అక్రమంగా డబ్బులు ఖర్చుపెట్టడాన్ని నిలదీయాలి. గ్రామస్థాయి నుండే ఈ దిశగా కృషి జరగాలి. ప్రతి అంశాన్ని గ్రామ ప్రజలకు తెలియచేస్తూ పంచాయతీ పాలకులు సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టాలి. రాజకీయ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలి. గ్రామ ప్రజలు పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా సేవాదృక్పథం కలిగిన వ్యక్తిని గ్రామాభివృద్ధికి పాటుపడే నాయకుణ్ణి ఎన్నుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.

గ్రామాలే దేశాభివృద్ధికి పట్టు కొమ్మలు.వ్యవసాయ ఆధా రిత మనదేశంలో పల్లెలు సింహ భాగం ఆక్రమిస్తున్నాయి. గ్రామ స్వరాజ్య స్థాపనలో ఏటేటా బడ్జెట్ల కేటాయింపులో పల్లెజనం బాటనే ప్రభుత్వాలు ఎంచుకొంటాయి. అయితే పంచాయతీలకు వాస్త వానికి దక్కాల్సిన వాటా నిధుల పైనేఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. చట్టప్రకారం ఇవ్వా ల్సిన నిధులు,అధికారాలపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్రం ఆశాజనకంగా స్పందించకపోవడం శోచనీయం.

కేవలం పంచా యతీ ఎన్నికలు జరిగినప్పుడే పాలకులకు గ్రామాలు గుర్తుకు వస్తాయి. గతానికి భిన్నంగా రాజకీయ జోక్యం పెచ్చుమీరుతోంది. పార్టీల రహిత ఎన్నికలని పేరుకే గానీ బహిర్గతం కాని విధంగా పార్టీలు, నేతలు ప్రతిసారీ ఎన్నికలప్పుడు కిందిస్థాయిలో తమ మాట చెల్లుబాటుకు తెలియకుండా విన్యాసాలు చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ముందుగా పల్లెల్లో పెత్తనం దక్కితే అవలీలగా సాధారణ ఎన్నికల్లో పైచేయి సాధించవచ్చని నేతలు ఉవ్విళ్లూరు తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎన్నో వివాదాల నడుమ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. చాలా కాలం క్రితం నిర్వహించిన ఎన్నికలు మళ్లీ ఇప్పుడు కార్యరూపంలోకొచ్చాయి.

మారుతున్న కాలం, సాంకేతికత విప్లవం, జనచైతన్యంలో, ఆలోచనల్లో వచ్చిన ఎన్నో రూపాంతరాలు ఈ దఫా ఎన్నికలకు వేదికలయ్యాయి. పంచాయతీ రాజ్‌ చట్టానికి ప్రతి రాష్ట్రంలో అక్కడి పరిస్థితులకనుగుణంగా ఎన్నో మార్పులు, చేర్పులు చేస్తుండటం గమనార్హం. ఇక ఎన్నికల సమయంలో ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లోనూ మార్పులకు పూనుకుంటున్నారు. ప్రధాన భూమికలైన నిధులు,విధులు, స్థానిక సంస్థలకు అప్పగించడంలోనే చిక్కులు వస్తున్నాయి. ఉదాహరణకు గతంలో గ్రామస్థాయిలో సర్పంచ్‌ అంటే ఆ ఊళ్లో అమితగౌరవ మర్యాదలుండేవి.

అలాగే సమితి/బ్లాక్‌ అధ్యక్షుల గురించి అప్పటి తరానికి తెలియనిది కాదు. ఎన్నోఏళ్ల తర్వాత చట్టాల సవరణల అనంతరం నిధులు, విధుల విభజన జరిగింది. అయినా వేల సంఖ్యలో ఉన్న పంచాయతీల అభివృద్ధి వెనుకడుగేనన్నది గ్రామాల్లోని పాతతరం ఇప్పుడు చెబుతున్నమాట. పంచాయతీల పురోభివృద్ధికి కేంద్ర ఆర్థిక సంఘం నిధులను సమకూరుస్తోంది. ఇందులో రకరకాల పనులు, రోడ్లు, కాలువలు, ఉపాధి కల్పన ఇత్యాది సమ్మిళితమై ఉన్నాయి. రాష్ట్రాలకిచ్చే ఆర్థికసంఘం నిధుల వినియోగంపై పూర్తి స్పష్టత కొరవడిందనే చెప్పుకోవచ్చు.

కేంద్ర నిధులు నిర్దేశించిన విధంగా వ్యయం జరగకపోవడంతోనే గ్రామాల్లో ఇంకా వెనుక బాటుతనం ఉంటోందన్న విమర్శలున్నాయి. రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు పంచాయతీల నిధుల వినియోగంలో వేర్వేరు పంథా లు అనుసరిస్తున్నాయని పరిశీలకులు,విశ్లేషకుల భావన. రాజకీయ జోక్యం కనపడని విధంగా పనిచేస్తోందని అక్కడక్కడా వినిపిస్తోంది. గ్రామపంచాయతీ వ్యవస్థ 1959వ సంవత్సరంలో ఆవిర్భావమైంది. పంచాయతీల పటిష్టతకు అప్పట్లో కేంద్ర, రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో అశోక్‌మెహతా కమిటీ కీలకంగా వ్యవహరించింది. అధికార వికేంద్రీకరణకు ఆయా కమిటీలు శ్రీకారం చుట్టాయి. దరిమిలా పంచాయతీలకు చట్టపర స్థాయిని కల్పించారు.

పంచాయతీలు తమ బాధ్యతలను నిర్వహిం చడానికి నిధుల కేటాయింపును చేపట్టారు. పంచాయతీలకు రాజ్యాంగ బద్ధంగా 29 అంశాలకు సంబంధించి విధులు, నిర్వ హణ విభాగాలు అప్పగించేందుకు చట్టం చేసినా ఇప్పటికీ పూర్తిగా ఆ అధికారాలు ఆ సంస్థలకు అప్పగించకపోవడం ఇక్కడ ప్రస్తావ నార్హం. వాస్తవానికి పది ప్రభుత్వశాఖల ద్వారా పంచాయతీలకు అధికార వికేంద్రీకరణ బాధ్యత నిర్దేశించినా అమలులో ఫలితాలు దిగదుడుపే. ప్రతి గ్రామంలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు ప్రధానంగా ఎన్నుకోబడతారు. ఆయా గ్రామాల్లో స్థాని కుల అవసరాలకనుగుణంగా ప్రణాళికలు అమలు చేసే బాధ్యతలు తీసుకుంటారు. అలాగే ప్రభుత్వం అప్పచెప్పే పనులనూ నిర్వ ర్తిస్తుంటారు. ఆ గ్రామ జనాభాకనుగుణంగా పంచాయతీల వర్గీ కరణ జరుగుతుంటుంది. జనాభాకు తోడు అక్కడి స్థానిక వసతుల కల్పన ఆధారంగా సిబ్బంది కేటాయింపు ఉంటుంది. ఓ మోస్తరు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటే దాదాపు 25 రకాలు పైగా సిబ్బంది అవసరమవ్ఞతారు. వివిధ పనుల నిర్వహణకు సిబ్బందిని క్రోడీకరిస్తారు. వీళ్లంతా ప్రతిరోజు గ్రామ సచివాలయం లో సంతకాలు పెట్టి వారి విధుల్లోకి హాజరుకావాల్సి ఉంటుంది.

కానీ ఎన్ని గ్రామాల్లో ఇలా జరుగుతోంది? వీరి ఫోన్‌ నెంబర్లు, ఇతర వివరాలు ఆ గ్రామంలో ఎంతమంది వద్ద ఉన్నాయి? ఏ సమయంలో వారు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటారు? ఏ పనికి ఎవరిని సంప్రదించాలో ప్రతి పంచాయతీలో సిటిజన్‌ పట్టి కలున్నాయా? దరఖాస్తు చేశాక ఎన్ని రోజులకు పని పూర్తవ్ఞ తుంది? ఇలా పలు ప్రశ్నలకు సమాధానం లభిస్తుందా అనేదే పలువ్ఞరి సందేహంగా ఉంది. సర్పంచ్‌ల ముందు ఎన్నో లక్ష్యాలు న్నాయి. ఇప్పుడు ఎపిలో జరుగుతున్న ఎన్నికల్లో పంచాయతీ విజేతల ముంగిట్లో ఎన్నో సవాళ్లున్నాయి. ముంగిట వేసవి ఎదురు చూస్తోంది.

గ్రామ ప్రజలకు అందుబాటులో తాగునీరు, శుభ్రతతో కూడిన జలం, క్లోరినేషన్‌కు పెద్దపీట వేయాల్సి ఉంది. ఇక గ్రామంలో ప్రతివీధిలో సిమెంటు రోడ్లు, కాలువలు, వీధిలైట్ల ఏర్పాట్లు కూడా వారి కార్యాచరణలో భాగమవ్వాల్సి ఉంది. సకా లంలో గ్రామసభను నిర్వహించి ప్రజాసమస్యలపై నిశిత పరిశీల నతో దృష్టి నిలపాలి. ఆరోగ్యమే మహాభాగ్యమన్నది గుర్తెరిగి సీజనల్‌ వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ హెల్త్‌ క్యాంపులు నిర్వ హించేలా ముందడుగు వేస్తే అందరూ హర్షిస్తారు. ఇక ప్రభుత్వ పెద్దలు సైతం సమన్యాయం, సమధర్మం సూత్రానికనుగుణంగా అన్ని గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని జనం కోరుకుంటు న్నారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి ఫలాలు ప్రతి పల్లెకూ అందాలని జనమంతా భావిస్తున్నారు. గ్రామం అభివృద్ధి చెంది నప్పుడే యావత్తు రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది.

చెన్నుపాటి రామారావు (రచయిత: సీనియర్‌ జర్నలిస్టు)