కాణిపాకం గుడిలో విలువైన ఆభరణం మిస్సింగ్

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఓ భక్తుడు సమర్పించిన విలువైన ఆభరణం కనిపించడంలేదు. దీంతో సదరు దాత ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆపై దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి వెళ్లడంతో.. సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వేలూరు గోల్డెన్ టెంపుల్‌కు చెందిన నారాయణి శక్తిఅమ్మణ్ మహా కుంభాభిషేకంలో పాల్గొని స్వామివారికి బంగారు విభూది పట్టీ కానుకగా ఇచ్చారు. ఈ బంగారు విభూది పట్టి విలువ సుమారు రూ. 18 లక్షలు ఉంటుంది.

దీనిని ఆగష్టు 27న కాణిపాకం ఆలయ పునర్నిర్మాణం సమయంలో నిర్వహించిన మహా కుంభాభిషేకం రోజు స్వామివారికి అలంకరించారు. తర్వాత బ్రహ్మోత్సవాల్లోను వాడారు. కాగా సదరు భక్తుడు తాను కానుకగా ఇచ్చిన దానికి సంబంధించిన రసీదు ఇవ్వాలని అడిగాడు. తర్వాత ఇస్తామని చెప్పి పంపించారు. తర్వాత మరోసారి రసీదు అడుగగా..ఆ ఆభరణం మిస్ అయ్యిందని తెలిపారు. ఆలయ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బంగారు విభూది పట్టీ మాయమైందని మంత్రులకు దాత ఫిర్యాదు చేశారు. మరి ఈ భరణం ఎలా మిస్ అయ్యిందనేది ఇప్పుడు చర్చ గా మారింది.