చిరు , బాలయ్య ల మధ్య చిన్న హీరో మూవీ..

సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి బాలకృష్ణ , తమిళ్ హీరో విజయ్ లు పోటీ పడుతున్నారని అంత అనుకుంటున్నారు కానీ వీరితో పాటు చిన్న హీరో సంతోష్ శోభన్ కూడా బరిలోకి దిగుతున్నాడు. చిన్న , పెద్ద హీరోలంతా కూడా సంక్రాంతి బరిలో రావాలని అనుకుంటారు. సినీ అభిమానులంతా సంక్రాంతి సీజన్ కోసం ఎదురుచూస్తుంటారు. తమ అభిమాన హీరోల చిత్రాలు సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి అలరిస్తుంటాయి. ఇది ప్రతి ఏడాది జరుగుతున్నదే. ఈ సారి కూడా ముగ్గురు అగ్ర హీరోలు పోటీపడుతున్నారు.

బాబి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో చిరంజీవి హీరోగా నటిస్తుండగా,మాస్ రాజా రవితేజ కూడా ఓ క్యారెక్టర్ చేస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్‌కాగా.. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పతాక స్థాయికి చేరిపోయాయి. సంక్రాంతి బరిలో ఈ మూవీ రాబోతుంది.

అలాగే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘వీరసింహా రెడ్డి’ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో కూడా శృతి హాసన్ హీరోయిన్. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే? ఈ రెండు సినిమాలూ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పైనే వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలతో పాటు తమిళ్ హీరో విజయ్ నటిస్తున్న ‘వారిసు’ మూవీని డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్. ఈ మూవీ కూడా సంక్రాంతి కి రాబోతుంది. ఈ మూడు మాత్రమే కాదు సంతోష్ శోభన్, ప్రియ భవాని జంటగా నటించిన ‘కళ్యాణం కమనీయం’ లాంటి చిన్న సినిమా కూడా సంక్రాంతి బరిలో రాబోతుంది. ముగ్గురు అగ్ర హీరోల మధ్య సంతోష్ ఏ మేరకు విజయం సాదిస్తాడో..ఏ మేరకు థియేటర్స్ దొరుకుతాయో చూడాలి.