తెలంగాణ పెండింగ్ బిల్లులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

'Supreme' notices to CSs of AP and Bihar states
supreme-court

న్యూఢిల్లీః తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై సుప్రీంకోర్టులో ఏప్రిల్ 10వ తేదీన విచారణ జరగనుంది. తెలంగాణ గవర్నర్ తమిళి సై వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిటిషన్ దాఖలు చేశారు.

ఇందులో ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శిని చేర్చారు. గవర్నర్ వద్ద బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 10 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌ లో ఉన్నాయని పిటిషన్ లో పేర్కొంది. దీనిపై గవర్నర్ కార్యదర్శితో అడిషనల్ సోలిసిటరి జనరల్ ఇంతకుముందే చర్చించారు. రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది.

గవర్నర్ తీరు మంత్రి మండలి సలహాకు వ్యతిరేకంగా ఉందని కెసిఆర్ సర్కారు చెబుతోంది. ఇటువంటి విచక్షణాధికారాలు గవర్నర్‌కు ఉండవని ప్రభుత్వం అంటోంది. రాష్ట్రానికి సంబంధించిన ఆయా బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టడానికి న్యాయమైన కారణాలు ఏవీ లేవని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు నెలలు గడుస్తున్నా… బిల్లులకు ఆమోదం లభించలేదని, దీంతో వేరే మార్గం లేకే ప్రత్యేక పరిస్థితుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించామని తెలంగాణ సర్కారు అంటోంది.