రైతుల ఆందోళనలపై స్పందించిన అమెరికా

రైతుల సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గం..అమెరికా

వాషింగ్టన్‌: భారత్‌లో సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళ‌న‌ల‌పై అమెరికా ప్ర‌భుత్వం స్పందించింది. మోడి స‌ర్కార్ రూపొందించిన కొత్త చ‌ట్టాల వ‌ల్ల భార‌తీయ మార్కెట్ల స‌మ‌ర్థ‌త పెరుగుతుంద‌ని అగ్ర‌రాజ్యం అభిప్రాయ‌ప‌డింది. అయితే రైతుల నిరసనలు, వారి సమస్యల పరిష్కారానికి చర్చలు ఒక్కటే మార్గమని అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. దాదాపు మూడు నెలలుగా జరుగుతున్న నిరసనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించగా, ఇతర దేశాల వారు తమ వ్యవహారాల్లో కల్పించుకోవాల్సిన అవసరం లేదని భారత రాజకీయ నేతలు, ప్రముఖులు మండిపడుతుండగా, అమెరికా ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇండియాలో మార్కెట్ పనితీరును మెరుగుపరిచేందుకు ఓ ద్వైపాక్షిక నేస్తంగా అమెరికా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.

రైతుల నిరసనలపై బైడెన్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వారి సమస్యలను భారత ప్రభుత్వం పరిష్కరిస్తుందని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని భారత ప్రభుత్వం సాధిస్తుందనే నమ్ముతున్నామని ఆయన అన్నారు. ఇదే సమయంలో భారత మార్కెట్లలో, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను అమెరికా స్వాగతిస్తుందని, తద్వారా మార్కెట్ల పనితీరు కూడా మెరుగుపడి, కష్టపడుతున్న రైతులకు మరింత ఆదాయం లభిస్తుందనే నమ్ముతున్నామని పేర్కొంది.

అయితే, చాలా మంది అమెరికన్ ప్రజా ప్రతినిధులు రైతుల ఉద్యమానికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై భారత ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోందని, దానికి బదులుగా వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తే మంచిదని తాను భావిస్తున్నానని కాంగ్రెస్ మెంబర్ హేలీ స్టీవెన్స్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో రైతు ప్రతినిధులు, ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చలను స్వాగతిస్తున్నామని అన్నారు. మరో కాంగ్రెస్ సభ్యురాలు ఇల్లామ్ ఒమర్ సైతం రైతులకు సంఘీభావం తెలిపారు.

కాగా, భారత విదేశాంగ శాఖ నిన్న ఓ ప్రకటన విడుదల చేస్తూ, వ్యవసాయ రంగంలో సంస్కరణలను ఆమోదించలేని ఓ చిన్న వర్గం మాత్రమే నిరసనలకు దిగిందని, మిగతా దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు సాగు చట్టాలను స్వాగతిస్తున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేంయడి:https://www.vaartha.com/news/national/